విజ్ఞాన నిధి వికీపీడియా..
The article about Telugu Wikipedia appeared in Namaste Telangana on December 11, 2016.
సిటీబ్యూరో:ప్రాపంచిక విషయాలను, చారిత్రక ఘట్టాలను, శాస్త్రీయ విషయాలను ప్రపంచానికి చేరువ చేస్తున్న విజ్ఞాన నిధి వికీపీడియా. ఆధునిక సాంకేతిక పద్ధతుల ఆధారంగా ఆన్‌లైన్‌తో ప్రపంచంలోని పలు ఆసక్తికరమైన విషయాలన్నింటనీ ప్రజలందరికీ చేరువ చేసే నేస్తం ఇది. అందరికీ ప్రవేశం, అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండే ఈ ఎన్‌సైక్లోపెడియాలో మన చరిత్ర, మన సంస్కృతి మరెన్నో విషయాలను జోడించేందుకు సమాచార సైనికులతో వికీపీడియా డేను పురస్కరించుకొని గోల్డెన్ త్రెషోల్డ్‌లో శనివారం ఓ కార్యశాలను నిర్వహించింది. విజ్ఞాన సమాచారం,భౌగోళిక, చారిత్రక అంశాలు, సాంస్కృతిక విషయాలను వికీపీడియాలో చొప్పించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను ఈ కార్యశాలలో చర్చించారు. వికీపీడియాలో అందరూ తమకు తెలిసిన ఆసక్తికరమైన అంశాలపై వ్యాసాలు రాయవచ్చని, ప్రపంచానికి కొత్త విషయాలను పరిచయం చేయవచ్చని ఆంగ్ల వికీపీడియన్ టిటో దత్తా అన్నారు. వికీ ట్రైనర్, ట్రైనర్ ద ట్రైనర్ కార్యక్రమంలో వికీపీడీయన్లు కశ్యప్, ప్రణయ్ పలు సాంకేతిక అంశాలను తెలుగు వికిపీడియన్లకు వివరించారు. చరిత్రకారుడు, కవి కట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ గోల్కొండ వంటి పలు చారిత్రక ప్రదేశాల్లో ప్రజలకు తెలియని చారిత్రక, సాంకేతిక ప్రదేశాలు, ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయని వాటన్నింటినీ సేకరించి, ప్రపంచానికి చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని వికీపీడియన్లు చేపట్టి విజయవంతం చేయాలన్నారు. సీనియర్ జర్నలిస్ట్ బీవీ ప్రసాద్, మౌర్య, మీనా గాయత్రి పాల్గొన్నారు.
Link to the original in Namaste Telangana